ఉద్యోగం చేసే అందిరిక ఈపీఎప్‌వో ఉంటుంది. జీతంలో కొంత మొత్తం..ఈ అకౌంట్‌కు మళ్లిస్తారు. వీటిని వివిధ అవసరాలకు వాడుకోవచ్చు.. 58 ఏళ్ల తర్వాతా అదే మొత్తం.. పింఛన్ రూపంలో వస్తుంది. కానీ ఇప్పుడు మన డబ్బులు మనకు ఇవ్వడానికి కూడా ఎన్నో సమస్యలు.. ఈపీఎఫ్‌వో అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులు, పింఛనుదారుల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన దాదాపు ఏడాది తరువాత ఖరారైన పింఛను చెల్లింపు పత్రాలు జారీ అవుతున్నాయి. పింఛను అర్హత వేతనం ఖరారుపై ఈపీఎఫ్‌వో కేంద్ర కార్యాలయం తాజాగా స్పష్టత ఇవ్వడంతో పాటు దామాషా పద్ధతిలో పింఛను లెక్కించాలని నిర్ణయించింది.
ప్రాంతీయ కార్యాలయాలకు ఆదేశాలు రావడంతో దరఖాస్తుల పరిష్కార ప్రక్రియలో కదలిక వచ్చింది. ఒకే పార్టు కింద లెక్కించే విధానంతో పోలిస్తే.. దామాషా పద్ధతిలో వచ్చే పింఛను 30-35 శాతానికి పైగా తగ్గిపోనుంది. దీంతోపాటు చందాదారుడిగా 20 ఏళ్లు పూర్తి చేసిన వారికి ఇచ్చే రెండేళ్ల బోనస్‌ను పార్ట్-బి సర్వీసులో కలిపి లెక్కించడంపై కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అధిక పింఛను కోసం దేశవ్యాప్తంగా 17,48,768 మంది దరఖాస్తు చేశారు. వీరిలో 2014 సెప్టెంబరు 1 కన్నా ముందు ఉద్యోగ విరమణ చేసిన వారు 4,10,039 మంది ఉంటే.. ఆ తేదీ తరువాత రిటైరైన/కానున్న వారు 13,38,729 మంది. వీరంతా దరఖాస్తు చేసి ఏడాది గడుస్తున్నా.. పరిష్కారం కాలేదు. కొందరికి ఈపీఎఫ్‌వో డిమాండ్ నోటీసులు జారీచేసి బకాయిలు వసూలు చేసినా.. తరువాత కదలిక లేదు. అర్హత వేతనం, పింఛను లెక్కింపు విధానంపై స్పష్టత లేకపోవడంతో తీవ్ర జాప్యం జరిగింది. వారం రోజుల కిందట ఇది ఖరారు కావడంతో దరఖాస్తుదారులకు డిమాండ్ నోటీసులు జారీ అవుతున్నాయి.
ఇప్పటికే ఈపీఎస్ బకాయిలు జమ చేసిన వారికి పింఛను పత్రాలు విడుదల అవుతున్నాయి. 1995 నవంబరు 15 తరువాత సర్వీసులో చేరిన వారికి పార్ట్-బి, పార్ట్-సి కింద.. అంతకు ముందు నుంచీ ఈపీఎఫ్ చందాదారుడిగా ఉన్నవారికి పార్ట్-ఎ, పార్ట్-బి, పార్ట్-సి కింద పింఛను లెక్కిస్తున్నారు.