కెనడా భారత్‌ల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గతేడాది కెనడాలో భారత దౌత్య అధికారులపై వరుస బెదిరింపులపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో ఆ దేశ వ్యవస్థల నుంచి ఎలాంటి సహకారం లభించకపోగా భారత దౌత్య అధికారులకు బెదిరింపులు వచ్చాయని అన్నారు. అందుకే అక్కడ వీసా జారీ సేవలను నిలిపివేయాల్సి వచ్చిందని ఆయన వివరించారు. ఒక దేశ దౌత్య కార్యాలయాలపై దాడులు జరిగినప్పుడు, అక్కడి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం వల్ల తప్పుడు సంకేతాలు పంపిస్తాయని జైశంకర్ స్పష్టం చేశారు
ఖలిస్థానీ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు భారత ఏజెంట్లే కారణమని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో నిరాధార ఆరోపణలు చేయడం ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు కారణమైంది. ఈ క్రమంలోనే కెనడాలో పనిచేస్తున్న భారత దౌత్యవేత్తపై అక్కడి ప్రభుత్వం బహిష్కరణ వేటువేయగా ప్రతి చర్యగాభారత్ కూడా దిల్లీలోని కెనడా దౌత్యవేత్తను బహిష్కరించింది. ఈ క్రమంలో చెలరేగిన ఉద్రిక్త పరిస్థితులతో గతేడాది సెప్టెంబర్‌లో భారత్ అక్కడ వీసా సేవలను నిలిపివేసింది.