కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 8 నెలల కాలానికి వార్షిక బడ్జెట్‌ను కాసేపట్లో లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను సమర్పించనున్నారు. వరసగా ఏడుసార్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనతను నిర్మల సాధించబోతున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన డిజిటల్ బడ్జెట్ ట్యాబ్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నార్త్ బ్లాక్‌లోని ఆర్థిక శాఖ కార్యాలయం వద్ద ఆవిష్కరించారు. అనంతరం బడ్జెట్ ప్రతులతో రాష్ట్రపతి భవన్‌కు వెళ్లగా.. బడ్జెట్ ప్రతులను రాష్ట్రపతికి అందించి అనుమతి తీసుకున్నారు.
ఉదయం పదిన్నరకు కేంద్ర కేబినెట్ సమావేశమై 2024-25 వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలపనుంది. అనంతరం లోక్‌సభలో 11 గంటలకు నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అభివృద్ధి సంక్షేమాల మధ్య ప్రభుత్వం సమతూకం పాటించాలని, వృద్ధికి ఊతమిచ్చి ద్రవ్యోల్బణం నియంత్రణకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించాలన్న ప్రధాని మోదీ ఆకాంక్షలకు అనుగుణంగా వివిధ రంగాలకు ప్రాధాన్యాల మేరకు నిధులు కేటాయించే అవకాశం ఉంది.