భారత్‌లో తొలి ఎలక్ట్రిక్ హైవే త్వరలోనే రాబోతోంది. నాగ్‌పుర్‌లో ఈ హైవేను ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. దిల్లీలో జరిగిన ఏసీఎంఏ వార్షిక సదస్సులో మాట్లాడిన గడ్కరీ.. విద్యుత్ రహదారుల అభివృద్ధికి మార్గాలు, సాంకేతికతలపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని వెల్లడించారు. ఆర్థికంగానూ వీటి వల్ల ప్రయోజనం ఉంటుందన్నారు.
విద్యుత్ రహదారుల ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న ప్రైవేట్ రంగ పెట్టుబడిదార్లకు గడ్కరీ స్వాగతం పలికారు. వారికి పూర్తి స్వేచ్ఛను ఇస్తామని తెలిపారు. పైగా ఈ తరహా రహదార్ల కోసం ప్రభుత్వానికి చౌకగా విద్యుత్‌ను ఇవ్వడం విద్యుత్ మంత్రిత్వ శాఖకూ పెద్ద కష్టమైన పని కాదని చెప్పారు. ఒక్కో యూనిట్ రూ.3.50కే విద్యుత్‌ను సరఫరా చేసేలా తాను ప్రయత్నిస్తున్నానని వివరించారు. ఎలక్ట్రిక్ తీగల నిర్మాణం ప్రైవేట్ రంగ పెట్టుబడిదార్లు చేపడతారని.. టోల్ మాదిరిగా విద్యుత్ ఛార్జీని ఎన్‌హెచ్‌ఏఐ (జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ) వసూలు చేస్తుందని కేంద్ర మంత్రి వెల్లడించారు.