అయోధ్య రామ మందిరంలో గురువారం మంత్ర ఉచ్ఛరణల నడుమ బాల రాముడి విగ్రహాన్ని గర్భగుడిలోకి చేర్చారు. తాజాగా, బాల రాముడి విగ్రహం ముఖాన్ని బయటి ప్రపంచానికి రివీల్ చేశారు. అయోధ్య రామాలయంలో బాల రాముడి విగ్రహం ముఖం ఇలా ఉన్నది.ఐదు సంవత్సరాల బాలుడి రూపంలో నిలబడి ఉన్న స్థితిలో ఈ విగ్రహాన్ని చెక్కారు. కృష్ణ వర్ణపు శిలతో ఉన్న ఈ విగ్రహాన్ని మైసూరుకు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కారు. ఈ విగ్రహం ఎత్తు 51 అంగుళాలు.
అయితే.. అయోధ్యలో బాలరాముడి ఫోటోలు బయటకు రావడంపై శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర చీఫ్ ప్రీస్ట్ ఆచార్య సత్యేంద్ర దాస్ స్పందించారు. ‘ప్రాణ ప్రతిష్ట ముగిసే వరకు శ్రీరాముని కళ్ళు చూపించకూడదు. ప్రస్తుతం వైరల్ అవుతున్న విగ్రహం నిజం కాదు. ఒకవేళ అవి రాముడి కళ్లే అయితే దానిపై విచారణ చేస్తాం. ఫోటోలు ఎలా బయటకు వచ్చాయని దానిపై ఆరా తీస్తాం’ అని ఆయన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.