మధ్యప్రదేశ్​లో చెట్టును ఢీకొన్న కారు.. ఐదుగురు సర్కార్ ఉద్యోగులు దుర్మరణం

-

చెట్టును కారు ఢీకొట్టిన ఘటనలో  ఐదుగురు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదం మధ్యప్రదేశ్​లోని ఉమారియా జిల్లాలో ఇవాళ తెల్లవారుజామున చోటుచేసుకుంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా.. మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించినట్లు పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉమారియా జిల్లాలోని ఘున్​ఘటి పోలీస్​స్టేషన్​ పరిధిలో ఈరోజు తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో వేగంగా వెళ్తున్న ఓ కారు అకస్మాత్తుగా వచ్చి చెట్టును ఢీకొట్టింది. వేగంగా వచ్చి బలంగా ఢీ కొట్టడంతో కారులో ఉన్న వారిలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. అనంతరం ఐదుగురి మృతదేహాలను శవపరీక్షల కోసం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరిలించినట్లు పోలీసులు తెలిపారు.

మృతులంతా ప్రభుత్వ ఉద్యోగులేనని సమాచారం. వారంతా ఓ పుట్టినరోజు వేడుకకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదం అనంతరం కారు నుజ్జునుజ్జైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news