ట్యాక్సీ సర్వీస్ ధరలకు సంబంధించి కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రంలో ట్యాక్సీలకు ఫిక్స్‌డ్ ఛార్జీలను అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఓలా, ఉబర్ వంటి యాప్ ఆధారిత సంస్థలతో పాటు, నాన్-యాప్ బేస్డ్ ట్యాక్సీ సర్వీస్‌లకు ఈ ఛార్జీలు అమలు చేస్తున్నట్లు తెలిపింది. ఇందుకోసం ‘ఫిక్స్‌డ్ ఫేర్ రూల్’ పేరుతో కొత్త నిబంధనలను కన్నడ సర్కార్ తాజాగా తీసుకొచ్చింది. క్యాబ్ అగ్రిగేటర్ సంస్థలు వినియోగదారుల నుంచి ఇష్టానుసారంగా ధరలను వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో తీసుకున్న నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని తెలిపింది.
తాజా నిబంధనల ప్రకారం వాహనం ఖరీదు ఆధారంగా క్యాబ్ సర్వీస్‌లను మూడు భాగాలుగా విభజించింది అవేంటంటే?
వాహనం ధర రూ.10 లక్షల కంటే తక్కువగా ఉంటే మొదటి నాలుగు కిలో మీటర్లకు కనీస ఛార్జీ రూ.100. తర్వాత ప్రతి అదనపు కి.మీ. రూ.24 చెల్లించాలి
కారు ఖరీదు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల మధ్య ఉన్నట్లైతే కనీస ఛార్జీ రూ.115, అదనపు కి.మీ రూ.28
వాహనం ధర రూ.15 లక్షలు దాటితే తొలి నాలుగు కి.మీ. కనీస ఛార్జీ రూ.130 తర్వాత ప్రతి కి.మీ. రూ.32
క్యాబ్ బుక్ చేసిన తర్వాత మొదటి ఐదు నిమిషాల వెయిటింగ్ ఉచితం. తర్వాత ప్రతి నిమిషానికి ఒక రూపాయి ఛార్జీ వర్తిస్తుంది
యాప్ ఆధారిత ట్యాక్సీ సర్వీస్‌ను అందించే సంస్థలు ఐదు శాతం జీఎస్టీతోపాటు, టోల్ ఛార్జీలు వసూలు చేయొచ్చు
రాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య క్యాబ్ సర్వీస్‌లు అందించే సంస్థలు సాధారణ ధరలకు అదనంగా పది శాతం వసూలు చేసుకోవచ్చు.