ఘోర విమాన ప్రమాదం త్రుటిలో తప్పింది. మధ్యప్రదేశ్ జబల్ పూర్ విమానాశ్రయంలో రన్ వే నుంచి విమానం జారి పోయింది. దీంతో పైలెట్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి 55 మంది ప్రయాణికులు 5 గురు సిబ్బందితో అలయన్స్ ఎయిర్ కు చెందిన ఏటీఆర్ -72 విమానం మధ్యప్రదేశ్ జబల్ పూర్ కు బయలుదేరింది. ఉదయం 11.30 గంటలకు ఢిల్లీ నుంచి బయలు దేరిన ఫ్లైట్ 9ఐ317 విమానం జబల్ పూర్ లోని దుమ్నా విమానాశ్రయంలో 1.30 నిమిషాలకు ల్యాండ్ కావాలి. అయితే ల్యాండ్ అవుతున్న సమయంలో విమానం చక్రాలు రన్ వే నుంచి కిందికి జారాయి. దీంతో అలెర్ట్ అయిన పైలెట్ విమానాన్ని ప్రమాదం నుంచి తప్పించారు. ఈ ఘటనలో మొత్తం 55 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే.. డీజీసీఏ అధికారులు విచారణ ప్రారంభించారు. జబల్ పూర్ విమానాశ్రాయానికి చేరుకుని ఘటనకు గల కారణాలను అన్వేషిస్తున్నారు.