నార్త్ ఇండియాను పొగమంచు కమ్మేసింది. ముఖ్యంగా దేశ రాజధాని దిల్లీ మంచు గుప్పిట్లో చిక్కుకుంది. దిల్లీలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 5 డిగ్రీలకు పడిపోయాయి. పొగమంచు వల్ల 17 విమాన సర్వీసులు రద్దయ్యాయి. మరో 30 విమానాలు ఆలస్యం అయ్యాయి. విమానాల ఆలస్యం వల్ల ప్రయాణికుల గంటల తరబడి విమానాశ్రయాల్లో పడిగాపులు కాస్తున్నారు. మరోవైపు పొగమంచు కారణంగా 30 రైళ్లు ఆలస్యంగా నడుస్తోన్నాయి.
దట్టమైన పొగమంచు కమ్మేయడంతో విజిబిలిటీ నాణ్యత పడిపోయింది. దిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయం సమీపంలోని పాలం అబ్జర్వేటరీ 50 మీటర్ల విజిబిలిటీ మాత్రమే ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అనేక ప్రాంతాల్లో విజిబిలిటీ సున్నా మీటర్లకు పడిపోవడంతో ప్రజలు అనవసర ప్రయాణాలు చేయవద్దని, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
దిల్లీతో పాటు ఉత్తరప్రదేశ్, హర్యానా, చండీగఢ్, పంజాబ్‌లలోనూ దట్టమైన పొగమంచు కొనసాగుతుంది. ఉదయం ఐదున్నర ప్రాంతంలో వారణాసి, ఆగ్రా, గ్వాలియర్, జమ్ము, పఠాన్‌కోట్, చండీగడ్‌లలో సున్నా మీటర్ల విజిబిలిటీ ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ప్రయాగ్‌రాజ్, తేజ్‌పూర్‌లో 50మీటర్ల విజిబిలిటీ ఉందని వెల్లడించింది. అగర్తలాలో 100 మీటర్లు, అమృత్‌సర్‌లో 200లు, గోరఖ్‌పూర్‌లో 300 మీటర్ల వరకూ దృశ్యనాణ్యత ఉందని తెలిపింది.