దేశంలో కరోనా కేసులు భారీగా పెరగడం వల్ల కొన్ని లక్షల మంది కోవిడ్ చికిత్స తీసుకుంటున్నారు. చాలా మంది ఇళ్లలోనే ఉండి చికిత్స తీసుకుంటుంటే కొందరు హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతున్నారు. అయితే చాలా మందికి ఆక్సిజన్ అవసరం అవుతోంది. దీంతో దేశంలో ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ కాన్‌సన్‌ట్రేటర్లకు డిమాండ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే వాటిని బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. అయితే విదేశాల్లో బంధువులు, స్నేహితులు, తెలిసిన వారు ఉంటే వారితో ఆక్సిజన్ సిలిండర్లు, కాన్‌సన్‌ట్రేటర్లను తెప్పించుకోవచ్చు. అందుకు గాను ఎలాంటి పన్ను ఉండదని కేంద్రం తెలిపింది.
భారత్‌లో కోవిడ్ చికిత్స పొందుతున్న వారు విదేశాల నుంచి ఆక్సిజన్ సిలిండర్లు, కాన్‌సన్‌ట్రేటర్లను తెప్పించుకోవచ్చు. వాటిని ఇండియాకు తెప్పించుకుంటే వాటిపై పన్ను విధించరు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో చాలా మందికి మేలు జరగనుంది. వాటిపై ఎలాంటి పన్ను విధించబోమని సంబంధిత మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
సాధారణంగా భారత నియమాల ప్రకారం విదేశాల నుంచి వచ్చే బహుమతులపై కస్టమ్స్ సుంకం విధిస్తారు. ఆ బహుమతుల విలువ రూ.1000 దాటితే పన్ను + జీఎస్‌టీ కలిపి వసూలు చేస్తారు. కానీ ఆక్సిజన్ సిలిండర్లు, కాన్‌సన్‌ట్రేటర్లకు ఈ విషయంలో మినహాయింపు ఇచ్చారు. అంటే విదేశాల్లో ఉన్నవారు భారత్‌లో ఉన్న తమ వారికి ఆక్సిజన్ సిలిండర్లు, కాన్‌సన్‌ట్రేటర్లను బహుమతులుగా అందజేయవచ్చన్నమాట. దీంతో ఎలాంటి పన్ను విధించరు.