రోడ్డు పక్కన ఉన్న గుడిసెల్లోకి బస్సు దూసుకెళ్లడంతో నలుగురు కూలీలు మృతి చెందారు. దక్షిణ గోవాలో శనివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో మరో ఐదుగురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకుని ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం : శనివారం రోజున వెర్నా ఇండస్ట్రియల్ ఎస్టేట్ వద్ద వలస కూలీలు వారి గుడిసెల్లో నిద్రిస్తుండగా అర్ధరాత్రి 11.30 గంటల సమయంలో ఓ బస్సు గుడిసెల పైకి దూసుకొచ్చింది. ఈ ఘటనలో గుడిసెల్లో నిద్రిస్తున్న వారిలో నలుగురు కార్మికులు అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గయపడిన మరో ఐదుగురిని మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు.
ఘటన జరిగిన సమయంలో తనకు ఫోన్ రావడంతో గుడిసెలో నుంచి బయటకు వచ్చానని తాను చూస్తుండగానే బస్సు రెండు గుడిసెల్లోకి దూసుకెళ్లిందని రూపేందర్ మాథుర్ అనే కూలీ తెలిపారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని అన్నారు. ఘటనలో తన సోదరుడు, మామ ప్రాణాలు కోల్పోయారని కన్నీరు మున్నీరయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపేస్తానని డ్రైవర్ బెదిరించినట్లుగా వాపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బస్సు డ్రైవర్‌ను అరెస్టు చేశారు.