కాశ్మీర్ విషయంలో మోసం.. సుప్రీంకోర్టు తీర్పుపై ఒవైసీ కీలక వ్యాఖ్యలు

-

కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370పై ఇవాళ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ బద్ధమైనదేనని.. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు తీరుపై ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టికల్ 370 పై సుప్రీం కోర్టు నిర్ణయం పూర్తిగా నిరాశ కలిగించిందని అన్నారు. కాశ్మీర్ విషయంలో మోసం జరిగిందన్నారు. ప్రత్యేక రాష్ట్రంగా ఉన్న జమ్ము కాశ్మీర్ అసెంబ్లీని రద్దు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు.


సుప్రీం తీర్పుపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మెహబాబా ముఫ్తీ సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370 పై సుప్రీం కోర్టు తీర్పు కాశ్మీర్ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకమని పేర్కొన్నారు. ఇది కాశ్మీర్ ప్రజల ఆకాంక్ష అని కొందరు అనుకోవడం పొరపాటు అని అన్నారు. ఇది తమ ఓటమి కాదని, ఇండియా ఓటమన్నారు. కాగా, జమ్ము కాశ్మీర్ కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 ని కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్ట్ 5వ తేదీన రద్దు చేసిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కొందరు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్లపై సుదీర్ఘ విచారణ జరిపిన సుప్రీం కోర్టు ఆర్టికల్ 370 రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైందేనని తీర్పు వెలువరించింది.

Read more RELATED
Recommended to you

Latest news