త్వరలో కాళేశ్వరం సందర్శిస్తా : మంత్రి ఉత్తమ్

-

కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. మేడిగడ్డ బ్యారేజీలో పిల్లర్ కుంగడం చాలా తీవ్రమైన అంశమన్నారు. మేడిగడ్డ నిర్మాణం చేపట్టిన ఏజెన్సీని, అధికారులను పర్యటనలో తన వెంట ఉండేలా చూడాలన్నారు. నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి జలసౌధలో ఆ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు. పెండింగ్, ఇతర ప్రాజెక్టుల పరిస్థితిపై ఆరా తీశారు. ప్రాజెక్టుల గురించి మంత్రికి ఈఎన్ సీ మురళీధర్ రావు వివరించారు. సమీక్ష అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు.


వచ్చేవారం నుంచి ప్రతి ప్రాజెక్ట్ పై విడివిడిగా ప్రత్యేకంగా సమీక్ష నిర్వహిస్తానని ఉత్తమ్ చెప్పారు. మేడిగడ్డను ఎవరు నిర్మించినా.. జరిగిన ఘటనకు బాధ్యత వహించాల్సిందేనని తేల్చి చెప్పారు. ప్రాజెక్టు నిర్మించిన ఏజెన్సీ, అధికారులు జవాబుదారులవుతున్నారని రూ. లక్ష కోట్లతో నిర్మించిన ప్రాజెక్టు కింద నామమాత్రంగా కొత్త ఆయకట్టు ఉంది. ఒక్కో ఎకరా సాగుకు అవుతున్న ఖర్చు వివరాలు చెప్పాలని అధికారులను అడిగా. ఎస్ఎల్ బీసీ సొరంగం పనుల పురోగతిపై ఆరా తీశాను. సొరంగం పనులు చేస్తున్న సంస్థకు బిల్లులు బకాయి ఉన్నట్లు తెలిసింది. రాష్ట్రంలోని 40 వేల చెరువులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం అని మీడియాకు ఉత్తమ్ వెల్లడించారు. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణానికి రూ.4,600 కోట్లు ఖర్చు చేశాం. అందులోని ఒక పిల్లర్ 1.2 మీటర్లు కుంగడంతో మరో మూడు పిల్లర్లపై ఆ ప్రభావం పడింది. ముందు రోజు సాయంత్రం పిల్లర్ కుంగిన వెంటనే ప్రాజెక్టులో నీటిని తోడేశాం. నీటిని తోడిన తర్వాత పిల్లర్ కుంగడం తగ్గింది అని అధికారులు మంత్రికి వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news