కాంగ్రెస్‌ను ఉద్దేశించి డెమొక్రాటిక్ ప్రొగ్రెసివ్ ఆజాద్ పార్టీ అధినేత గులాం నబీ ఆజాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్నిసార్లు ఆ పార్టీని చూస్తే.. విచిత్రమైన భావన కలుగుతుందని అన్నారు. బీజేపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుందేమోనని కొన్నిసార్లు తనకు అనుమానం వస్తుంటుందని వ్యాఖ్యానించారు. పార్టీలో సంస్థాగతమైన మార్పు కోసం గతంలో 23 మంది నేతలు పోరాడారని, కానీ, అగ్రనాయకత్వం వారి మాటలు వినిపించుకోలేదని మండిపడ్డారు. సమస్యలు లేవనెత్తినప్పుడు.. తామంతా బీజేపీ భాష మాట్లాడుతున్నామని విమర్శించేదని తెలిపారు. కానీ ఆ పార్టీనే భాజపాను గెలిపించాలని కోరుకుంటున్నట్లు తనకు చాలాసార్లు అనిపించిందని ఆజాద్ మీడియాతో వ్యాఖ్యానించారు. ఈ దేశంలో పేదరికం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం ప్రధాన సమస్యలని ఆయన పేర్కొన్నారు.
సుమారు రెండేళ్ల క్రితం ఆజాద్ కాంగ్రెస్‌ను వీడిన సొంత పార్టీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే పార్టీని వీడిన సమయంలో ఆయన రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన రాకతో పార్టీ పతనం మొదలైందని మండిపడ్డారు. ఇక తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.