ఈశాన్య రాష్ట్రం సిక్కింలో ఇటీవల కురిసిన వర్షాలు భారీ నష్టాన్ని మిగిల్చాయి. వరదల్లో 30కి పైగా మంది మృతి చెందారు. వీరిలో ఆర్మీ జవాన్లు కూడా ఉన్నారు. వరద సృష్టించిన విలయం నుంచి సిక్కిం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. ఆ రాష్ట్రంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
తీస్తా నది సృష్టించిన వరద బీభత్సానికి ప్రభావితమైన ప్రాంతాల్లో పూడికతీత పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ చర్యల్లో బంగారు, వెండి ఆభరణాలతో ఉన్న ఓ సంచి దొరికింది. అందులో బంగారు ఆభరణాలు లభించాయని బెంగాల్‌కు చెందిన మహిళ తెలిపింది. ఆ ఆభరణాల విలువ రూ.8 లక్షల పైనే ఉండవచ్చని అంటున్నారు.
సిక్కిం పొరుగునే ఉన్న పశ్చిమబెంగాల్‌లోని కాలింపోంగ్ జిల్లాలోనూ అనేక ప్రాంతాలు ఇప్పటికీ తీస్తా వరదల పూడికతోనే ఉన్నాయి. జిల్లాలోని తీస్తా బజార్ ప్రాంతంలో గురువారం సహాయక చర్యలు కొనసాగుతున్న సమయంలో.. సుమిత్రా ఛెత్రీ అనే మహిళ నగల సంచిని గుర్తించింది. సరైన ఆధారాలు ఉంటే బాధితులు ఛెత్రీ దగ్గరకు వచ్చి నగలు తీసుకోవచ్చని పంచాయతీ సభ్యుడు నార్డెన్ షెర్పా వెల్లడించారు.