ప్రపంచవ్యాప్తంగా పురుషుల్లో వంధ్యాత్యం (ఇన్ఫెర్టిలిటీ) సమస్య పెరుగుతోందట. ఈ సమస్యను ప్రభుత్వాలు సీరియస్ గా పరిగణించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ సమస్య పరిష్కారానికి వారు ఒక మార్గసూచీని రూపొందించారు. ఈ పరిశోధన బృందానికి ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు నేతృత్వం వహించారు.
వారు చేసిన సూచనలు ఏంటంటే.. తండ్రి కాలేకపోవడానికి కారణాలను తెలుసుకొని, తదనుగుణంగా చికిత్సలు పొందే హక్కు బాధితులకు ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్పారు. నిధులు, సరైన పరిశోధనలు, ప్రామాణిక చికిత్సల కొరత వంటి కారణాల వల్ల ప్రస్తుతం చాలామందికి ఉపశమనం దక్కడంలేదని చెప్పారు.
నిత్యం వాడే ఉత్పత్తుల్లో ఎండోక్రైన్ వ్యవస్థను దెబ్బతీసే రసాయనాలు పురుషులపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతున్నాయో తెలుసుకునేందుకు విస్తృతంగా పరీక్షలు నిర్వహించాలని శాస్త్రవేత్తలు సూచించారు. పని ప్రదేశం, వాతావరణపరమైన అంశాలు ఇందుకు కారణమవుతున్నాయా అన్నది పరిశీలించాలని పేర్కొంది. పురుషులు, మగపిల్లలను హానికర రసాయనాల నుంచి రక్షించడానికి విధాన నిర్ణయాలు అవసరమని… ఈ పదార్థాలకు సురక్షితమైన ప్రత్యామ్నాయాలను గుర్తించాలని సూచించారు.