బతుకమ్మకు నైవేద్యం.. మూడు రకాల సత్తు పిండ్లను ఇలా చేసేయండి..!

-

దసరా సెలవులు స్టాట్‌ అయిపోయి. ఆంధ్రాలో దుర్గమ్మ, తెలంగాణలో బతుకమ్మ సంబరాలు మరికొద్ది రోజుల్లో ప్రారంభంకానున్నాయి.. మనకు ఈ పదిరోజులు పండగే పండుగ. ఎవరి సంప్రదాయాలకు తగ్గట్టు వారు పూజలు చేస్తారు. తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ. ఇక్కడ ఆచారాలకు, సంప్రదాయలకు ఈ పండుగ అద్దం పడుతుంది. దేశవిదేశాల్లో ఉన్న తెలుగు వారు ఈ పండుగను ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. ఈ పండుగ రోజుల్లో నైవేద్యంగా చేసే సత్తు పిండికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మనం ఇక్కడ మూడు రకాల సత్తు పిండి నైవేద్యాల గురించి తెలుసుకుందాం.

గోధుమ సత్తు పిండి:

గౌరమ్మకు నైవేద్యంగా పెట్టడానికి గోధుమ సత్తు పిండిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఓ పావు గంటలోనే ఇది సిద్ధం అయిపోతుంది. ఒక కప్పు గోధుమ పిండి, పావు కప్పు బెల్లం, రెండు యాలకులు, రెండు టేబుల్‌ స్పూన్ల నెయ్యి కావాలి. ముందుగా ఒక కడాయిని తీసుకుని స్టౌ మీద పెట్టి వేడి చేయాలి. దానిలోకి గోధుమ పిండిని వేసుకుని పచ్చి వాసన పోయే వరకు దోరగా వేపించాలి. తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని బెల్లం, యాలకుల పొడి, నెయ్యి వేసి కలుపుకోవాలి. గోధుమ సత్తు పిండి తయారవుతుంది. అదే వీటిని లడ్డూల్లా చేసుకోవాలంటే మాత్రం ఇంకాస్త నెయ్యిని వేసి ఉండలు చుట్టుకోవాలి.

నువ్వుల సత్తు పిండి:

నువ్వుల సత్తు పిండి కోసం గ్లాసుడు నువ్వులు, అర గ్లాసుకు కాస్త తక్కువగా బెల్లం పొడి, కొంచెం యాలుకల పొడి, నెయ్యిని సిద్ధం చేసి పెట్టుకోవాలి. నువ్వుల్లో రాళ్లు లేకుండా క్లీన్ చేసుకోండి. ముందు రోజే వాటిని ఒక సారి కడిగేసుకుని ఎండలో పెట్టుకోవాలి. అవి శుభ్రంగా ఆరాక తెచ్చి పెట్టుకోవాలి. స్టౌ వెలిగించి గిన్న పెట్టుకోని అందులో నువ్వుల్ని వేసి చిటపటమనే వరకు వేగనివ్వాలి. నువ్వులు త్వరగా మాడిపోతాయి కాబట్టి లో ఫ్లేమ్‌లోనే చేయండి. అవి వేగాక కాస్త ఆరనిచ్చి.. మిక్సీలో వేయాలి. మరీ ఎక్కువగా మిక్సీ వేస్తే నువ్వుల్లో ఉండే నూనె బయటకు వచ్చి అది పొడిలా కాకుండా, ముద్దగా అయిపోతుంది. అందుకని కాస్త కచ్చాపచ్చాగా మిక్సీ చేసి తీసుకోవాలి. అందులోకి బెల్లం పొడి, యాలకుల పొడి, నెయ్యి వేసి పొడిపొడిలాడేలా కలుపుకోవాలి. ఇష్టమైన వారు బెల్లం కాకుండా పంచదార పొడి అయినా వాడుకోవచ్చు.

మక్క సత్తు పిండి:

మక్క సత్తు పిండిని తయారు చేసుకోవడానికి ఒక గ్లాసుడు మొక్క జొన్న గింజలు కావలి. అదే గ్లాసుతో పావు కప్పు చక్కెర తీసుకోండి. రెండు యాలకులు, రెండు చెంచాల నెయ్యిని సిద్ధం చేసి పెట్టుకోవాలి. పంచదారలో యాలుకలు వేసి మెత్తగా మిక్సీలో పొడి చేసి పెట్టుకోవాలి. మొక్క జొన్న గింజల్ని శుభ్రం చేసి పెట్టుకోవాలి. స్టౌ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. అందులో మక్క గింజల్ని వేసుకుని దోరగా వేపించుకుని పక్కనుంచుకోవాలి. చల్లారిన తర్వాత వాటిని మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. అందులో పంచదార పొడి, నెయ్యి వేసుకుని కలుపుకోవాలి. అంతే మక్క సత్తు పిండి రెడీ.

Read more RELATED
Recommended to you

Latest news