ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం పట్టుదలతో అభివృద్ధి లక్ష్యంగా అడుగులు వేస్తోంది. సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా వేగంగా ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలో ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న అంశాల్లో ఒకటి కొత్త రేషన్ కార్డుల జారీ.. తాజాగా ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది.
వైసీపీ ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసిన వారు మల్లీ అప్లై చేయాల్సిన అవసరం లేదని అధికార వర్గాలు వెల్లడించాయి. అప్పట్లో దాఖలైన దాదాపు 3.36 లక్షల అప్లికేషన్లు ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్టు పేర్కొన్నారు. మే 15 నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం మన మిత్ర అనే వాట్సాప్ సేవ ద్వారా దరఖాస్తులను స్వీకరించనున్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ విషయం కొద్ది రో8జుల క్రితమే ప్రకటించారు. ప్రజలకు మరింత సులభతరంగా సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ డిజిటల్ విధానం ద్వారా అప్లికేషన్ల ప్రక్రియను తీసుకురావడం జరిగింది. జూన్ లో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసేదిశగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.