మన చుట్టు పక్కల ఏదైనా ప్రమాదం జరిగినా, లేక హత్య జరిగినా ఏదైనా సాంఘిక విద్రోహ చర్య జరిగినా మనం వెంటనే 100 నంబర్ కు డయల్ చేస్తాం. సమస్యల్లో ఉన్నాం అంటే అందరిలో 100 కు డయల్ చేయాలనే ఆలోచన దానంతట అదే వస్తుంది. అంతలా 100 నంబర్ మనందరి బుర్రల్లో రిజిస్టర్ అయిపోయింది. కానీ త్వరలో ఈ నెంబర్ మారబోతుంది. 100 కు బదులు 112 నంబర్ ను తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను కూడా ఇప్పటికే రాష్ర్టాలకు జారీ చేసింది.
అనేక దేశాల్లో ఉన్నట్లుగానే మనదేశంలో కూడా అన్ని అత్యవరసర సేవలకు ఒకే నంబర్ ఉండాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకోసమే అన్ని అత్యవసర సేవలకు ఉన్న నంబర్ల స్థానంలో 112 నంబర్ ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఈ సేవ గురించి పెద్దగా ఎవరికీ అవగాహన లేదు కాబట్టి వివిధ రాష్ర్టాల్లో అందుబాటులో ఉన్న అత్యవసర నంబర్లకు ఫోన్ చేసినా సరే ఈ సర్వీసుకే వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. కానీ రాను రాను రాష్ర్టాలలో ఉండే ప్రజలకు కొత్త నంబర్ పై అవగాహన కల్పించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో డయల్ 100 కు ఫోన్ చేస్తే దాదాపు 10 నిమిషాలలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. కానీ ఈ సమయాన్ని 8 నిమిషాలకు కుదించాలని ప్రయత్నిస్తున్నారు. ఇక ఈ నూతన సర్వీసు పై ఎవరికీ పెద్దగా అవగాహన ఉండదు కాబట్టి మరో రెండు నెలల పాటు పాత నంబర్లనే కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో 112 సర్వీసుపై విస్తృతంగా ప్రచారం చేయాలని రాష్ర్టాలకు కేంద్రం సూచించింది.