దేశవ్యాప్తంగా నిన్నటి వరకు సూర్యుడు సెగలు కక్కాడు. ముఖ్యంగా దేశ రాజధాని దిల్లీలో భానుడి భగభగలతో ప్రజలు అల్లాడిపోయారు. ఉదయం నుంచే బయటకు రావాలంటే జంకారు. ఇక మధ్యాహ్నం అయితే ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఉక్కపోతతో విలవిలలాడిపోయారు. అలాంటి దిల్లీలో ఒక్కసారిగా వాతావరణం కూల్ అయింది. ఇక ఈరోజు ఉదయం నుంచి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది.
దిల్లీలోని సోనిపట్, రోహ్‌తక్, గాజియాబాద్, నోయిడా, గురుగ్రామ్, ఫరీదాబాద్, హిండన్ ఏఎఫ్ స్టేషన్, ఇందిరాపురం, జింద్, గొహనా ప్రాంతాలతో సహా దిల్లీతోపాటు ఎన్‌సీఆర్ పరిసర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షం కురిసింది. దేశ రాజధానిలో ఆదివారం రికార్డు స్థాయిలో 35.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఉక్కబోతతో ఇబ్బందిపడ్డారు.
ఆదివారం రాత్రి నుంచి ఉదయం వరకు కురిసిన వర్షంతో దిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. వచ్చే మూడు నాలుగు రోజుల పాటు దిల్లీలో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.