ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో భోలే బాబా నిర్వహించిన సత్సంగ్లో జరిగిన తొక్కిసలాటలో 121 మంది దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన పరారీలో ఉన్నారు. ఆయన కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. భోలే బాబాకు రాజస్థాన్లోని అల్వార్లో ఓ ఆశ్రమం ఉంది. అక్కడ కూడా భారీ సంఖ్యలో భక్తులు ఉన్నారు. ఓవైపు భోలే బాబాపై చర్యలు తీసుకోవాలని కొందరు డిమాండ్ చేస్తుండగా, మరికొందరు భక్తులు ఆయనపై సానుకూల ధోరణిని కలిగిఉన్నారు.
భోలే బాబా హాథ్రస్లో నిర్వహించిన సత్సంగ్లో రాజస్థాన్లోని సహజ్పుర్కు చెందిన కొందరు భక్తులు హాజరయ్యారు. వారు హాథ్రస్ తొక్కిసలాట ఘటనపై మాట్లాడుతూ.. సత్సంగ్ ముగియగానే భోలే బాబా అక్కడి నుంచి వెళ్లిపోయారని తెలిపారు. ఆ తర్వాత ప్రజలు ఒక్కసారిగా బయటకు రావడం వల్ల తొక్కిసలాట జరిగిందని .. సత్సంగ్కు భారీగా భక్తులు హాజరవ్వడం వల్ల ప్రమాదం జరిగిందని, వేడి కారణంగా చాలా మంది చనిపోయారని పేర్కొన్నారు. అయితే ఇది సత్సంగ్ నిర్వాహకుల తప్పే కానీ భోలే బాబాది కాదని, భోలే బాబాను హాథ్రస్ తొక్కిసలాట ఘటనలో ఇరికించేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.