ఉత్తర్‌ప్రదేశ్ హాథ్రస్ తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 121 మంది మరణించారు. మరో 28 మంది క్షతగాత్రులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. హాథ్రాస్లో సత్సంగ్ నిర్వహించినవారిపై పోలీసులు ఎఫ్ఐఐర్ నమోదు చేశారు. సత్సంగ్ ముఖ్య నిర్వాహకుడు దేవ ప్రకాశ్ మధుకర్, సికందరరావు తదితరులపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
మరోవైపు హాథ్రస్లో సత్సంగ్ నిర్వహించిన మత బోధకుడు నారాయణ్ సాకర్ హరి అలియాస్ ‘భోలే బాబా’ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. అయితే ఆయణ్ను అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా.. ప్రస్తుతం భోలే బాబా పరారీలో ఉన్నట్లు తెలిసింది. మెయిన్పురిలో భోలే బాబాకు చెందిన రామ్ కుటీర్ ఛారిటబుల్ ట్రస్ట్లో సోదాలు నిర్వహించగా అక్కడా ఆయన కనిపించలేదని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సునీల్ కుమార్ వెల్లడించారు. ఆయన కోసం తమ టీమ్స్ గాలిస్తున్నట్లు చెప్పారు. ఈ ఘటనపై బిహార్ డిప్యూటీ సీఎం, బీజేపీ నేత సామ్రాట్ చౌదరీ విచారం వ్యక్తం చేశారు. ఇంత మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని అన్నారు.