లిక్కర్ స్కామ్ వ్యవహారంలో మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు దిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఈ కేసులో ఆయనకు సాధారణ బెయిల్ మంజూరు చేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు నిలిపివేసింది. కేజ్రీవాల్ బెయిల్‌ను వ్యతిరేకిస్తూ ఈడీ పిటిషన్ వేసిన నేపథ్యంలో న్యాయస్థానం ఈ ఆదేశాలిచ్చింది.
లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్‌కు గురువారం సాయంత్రం రెగ్యులర్ బెయిల్ లభించిన విషయం తెలిసిందే. రూ.లక్ష వ్యక్తిగత బాండు సమర్పించిన తర్వాత ఆయన్ని విడుదల చేయవచ్చని న్యాయమూర్తి ఆదేశించింది. ఈ తీర్పుపై పైకోర్టులో అప్పీలు దాఖలు చేయడానికి వీలుగా దానిని 48 గంటలపాటు పక్కనపెట్టాలని ఈడీ చేసిన వినతిని ట్రయల్ కోర్టు తిరస్కరించింది. ఈ క్రమంలోనే ఈడీ హైకోర్టును ఆశ్రయించింది. ఇవాళ కేజ్రీవాల్ జైలు నుంచి విడుదల కానుండగా.. ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులను అమలుచేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. దీంతో కేజ్రీవాల్ ప్రస్తుతానికి జైలు నుంచి విడుదలయ్యే అవకాశం లేకుండా పోయింది.