కరోనా సమయంలో ఐటీ ఉద్యోగులంతా ఇంటి నుంచే పని చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత కూడా అలాగే కంటిన్యూ చేశారు. అయితే ఇక ఇప్పుడు ఆఫీసులకు వచ్చేయమని సదరు సంస్థలు ఉద్యోగులకు అల్టిమేటమ్ జారీ చేస్తున్నాయి. ఇప్పటికే పలు కంపెనీల ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్తున్నారు. ఇప్పుడు తాజాగా హెచ్సీఎల టెక్నాలజీస్ తమ ఉద్యోగులను ఆఫీసుకు రమ్మంటోంది.
వారంలో మూడు రోజులు కార్యాలయానికి వచ్చి పనిచేయాల్సిందేనని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ తన ఉద్యోగులకు సమాచారం ఇచ్చింది. ఆ మూడు రోజులు ఏవనేది ఉద్యోగుల ఇష్టానికే వదిలేయడం ద్వారా, వారికి వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే కొన్ని స్థాయిల ఉద్యోగులకు, కార్యాలయాలకు రావడం తప్పనిసరి చేశామని.. ఈ0 నుంచి ఈ3 గ్రేడ్‌ల సిబ్బందికి మాత్రం తప్పనిసరి చేయలేదని కంపెనీ సీఈఓ, ఎండీ సి విజయకుమార్ తెలిపారు. పూర్తిగా ఇంటి నుంచి పని అనేది మంచి ఆలోచనేమీ కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికే టీసీఎస్ తన ఉద్యోగులను అన్ని పనిదినాల్లోనూ కార్యాలయానికే వచ్చి పనిచేయాలని కోరింది. తద్వారా కరోనా సమయంలో మొదలైన పూర్తిస్థాయి వర్క్ ఫ్రం హోం (డబ్ల్యూఎఫ్‌హెచ్) సంప్రదాయానికి స్వస్తి పలికింది.