దేశ రాజాధాని ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండ్రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తుండటంతో ఢిల్లీ నగరం అతలాకుతలం అవుతోంది. వరద నీరు ముంచెత్తడంతో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. రహదారులపై భారీగా వరద నీరు పేరుకుపోవడంతో వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు. మెహ్రౌలీ- బదార్ పూర్, పరేడ్ రోడ్, కంటోన్మెంట్, ధౌలాఖాన్, గురుద్వారా రాకబ్ జంగ్, జీసస్ మేరీ మార్గ్, ఆర్కేపురం సెక్టార్ ప్రాంతాల్లో వరదలతో జనజీవనం స్తంభించింది.
కొన్నాళ్లుగా ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో రాజధాని పరిసర ప్రాంతాల్లోని కాలనీల్లో భారీగా వరద నీరు చేరుకుంది. దీంతో బయటకు వెళ్లేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.లోతట్టు ప్రాంతాల ప్రజల ఇళ్లల్లోకి నీరు చేరడంతో నానా అవస్థలు పడుతున్నారు. కాగా, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఐఏఎస్ కోచింగ్ సెంటర్ సెల్లార్‌లోకి వరద నీరు చేరడంతో ముగ్గరు ఐఏఎస్ అభ్యర్థులు ప్రాణాలు కోల్పొయారు.ఈ ఘటన దేశవ్యాప్తంగా ఒక్కసారిగా సంచలనం రేపడంతో పలు కోచింగ్ సెంటర్లపై ఢిల్లీ మున్సిపల్ అధికారులు చర్యలకు ఆదేశించిన విషయం తెలిసిందే.