కేంద్ర సర్వీసుల కోసం నిర్వహించే పరీక్షల్లో ఇటీవల అభ్యర్థులు మోసాలకు పాల్పడటంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇకమీదట పేపర్ లీకేజీలు, తప్పుడు ధృవ పత్రాలు సమర్పించి ఎవరూ మోసాలకు పాల్పడకుండా కేంద్రం సరికొత్త విధానాన్ని తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. అందుకే సరళమైన విధంగా, మోసాలకు తావులేకుండా నియామకాల ప్రక్రియను చేపట్టేందుకు స్వచ్ఛంద పద్ధతిన అభ్యర్థుల గుర్తింపు తనిఖీల కోసం ఆధార్ వెరిఫికేషణ్ చేపట్టేందుకు యూపీఎస్సీకి కేంద్రం అనుమతులు మంజూ రు చేసింది.
పేరు నమోదు, పరీక్షలు, నియామక దశల్లో తనిఖీలు చేయాలని సూచనలు చేసింది.ప్రొబేషనరీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ ఉదంతంతో కేంద్రం ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్ష సమయాల్లో అభ్యర్థులు మోసం చేయకుండా యూపీఎస్సీ ఇప్పటికే ముఖాలను గుర్తించే ఏఐ ఆధారిత టెక్నాలజీని, సీసీటీవీ నిఘాను అమలు చేస్తున్న విషయం తెలిసిందే.తాజాగా ఆధార్ వెరిఫికేషన్ సిస్టమ్ ద్వారా మోసాలను తగ్గించవచ్చని కేంద్రం భావిస్తోంది.