ఉత్తర భారతంలో వరణుడు విలయం సృష్టిస్తున్నాడు. ఎటు చూసినా చెరువులను తలపిస్తున్న వరద.. జలదిగ్బంధంలో చిక్కుకున్న గ్రామాలు.. వర్షం ధాటికి కుప్పకూలుతున్న భవనాలు.. వంతెనలు.. వరదలో కొట్టుకుపోతున్న ప్రజలు.. వాహనాలే కనిపిస్తున్నాయి. వానలతో ఆరు రాష్ట్రాలు విలవిల్లాడుతున్నాయి. ముఖ్యంగా హమిచల్ ప్రదేశ్, పంజాబ్, దిల్లీ, జమ్మూ కశ్మీర్, ఉత్తరా ఖండ్, హరియాణా తదితర రాష్ట్రాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. ఇప్పటికే వర్షాల ధాటికి 42 మంది మృతి చెందారు.
హిమాచల్లో దాదాపు 300 మంది ప్రజలు వేర్వేరు చోట్ల నీళ్లలో చిక్కుకున్నారు. యమున సహా ఉత్తరాది రాష్ట్రాల్లోని నదులన్నీ పొంగి ప్రవహిస్తున్నాయి. మరో రెండ్రోజులపాటు ఆయా రాష్ట్రాలకు భారీ వరద ముప్పు ఉందని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. తుపానులు, రుతుపవనాలు కలిసిపోవడంతోనే భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది. పంజాబ్‌లో విద్యాసంస్థలకు ఈ నెల 13 వరకు సెలవులు ప్రకటించారు. ఎగువ రాష్ట్రాల నుంచి నీళ్లను విడిచిపెడుతుండడంతో దిల్లీలో యమునానది ప్రమాద స్థాయి (205.33 మీటర్లు)ని మించి పరవళ్లు తొక్కుతోంది.