హర్యానాలో మరోసారి అలజడి రగులుతోంది. నూహ్ జిల్లాలో టెన్షన్ టెన్షన్‌గా వాతావరణం నెలకొంది. అధికారులు అనుమతి ఇవ్వనప్పటికీ హిందూ సంస్థలు ఇవాళ శోభాయాత్ర చేపట్టేందుకు సిద్ధమవుతుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నూహ్ వ్యాప్తంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి సరిహద్దులు మూసివేశారు. స్కూళ్లు, బ్యాంకులు మూసివేసి.. ప్రజలు గుమిగూడకుండా 144 సెక్షన్ విధించారు. మొబైల్ ఇంటర్నెట్, బల్క్ ఎస్‌ఎంఎస్ సేవలను నిలిపివేశారు.
శ్రావణమాసం చివరి సోమవారాన్ని (ఉత్తరాది ప్రకారం) పురస్కరించుకుని హిందూ సంస్థలు శోభాయాత్రకు పిలుపునిచ్చాయి. సెప్టెంబరు 3-7 వరకు జీ20 షెర్పా గ్రూప్ సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో శోభాయాత్రకు అనుమతివ్వలేమని అధికారులు స్పష్టం చేశారు. అయినా ఈరోజు శోభాయాత్రను నిర్వహించి తీరుతామని విశ్వహిందూ పరిషత్ తేల్చి చెప్పడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. 30 కంపెనీల పారామిలిటరీ బలగాలను రంగంలోకి దిగి.. జిల్లా సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. సోమవారం జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేశారు.