హిజాబ్ వివాదం మరోసారి వార్తల్లో అంశంగా మారింది. ఈఏడాది తొలినాళ్లలో కర్ణాటకలోని ఓ కళాశాలలో మొదలైన ఈ వివాదం చిలికిచిలికి గాలి వానలా మారింది. కర్ణాటకలోని ఉడిపి, చిక్ మంగళూర్, కొప్పెళ, బెళగావి, శివమొగ, మాండ్యా మొదలైన జిల్లాలకు కూడా ఈ వివాదం పాకింది. తాజాగా నిన్న మంగళవారం కర్ణాటక హైకోర్ట ఈ వివాదంపై సంచలన తీర్పు వెల్లడించింది. ఇస్లాం మతంలో హిజాబ్ అనేది తప్పనిసరి ఆచారం కాదని.. విద్యాసంస్థల్లో హిజాబ్ బ్యాన్ ను సమర్థించింది. విద్యాలయాలకు విద్యార్థుల యూనిఫాం తోనే రావాలంటూ సంచలన తీర్పును వెల్లడించింది. జస్టిస్ అవస్థితో కూడిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఈ తీర్పును వెల్లడించింది.
ఇదిలా ఉంటే కర్ణాటక తీర్పుపై ముస్తిం వర్గాల నుంచి నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. రేపు కర్ణాటక వ్యాప్తంగా బంద్ కు పిలుపునిచ్చాయి ముస్లిం సంఘాలు. ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించాలని కోరారు. మరోవైపు హిజాబ్ వివాదం సుప్రీం కోర్ట్‌కు చేరింది. అత్యవసరంగా విచారించాలని పిటిషనర్ల తరుపు న్యాయవాది సుప్రీంను కోరగా.. అందుకు నో చెప్పింది సుప్రీం కోర్ట్. ఈ విషయాన్ని హోలీ అనంతరం విచారిస్తామంటూ సీజేఐ ఎన్వీ రమణ అన్నారు.