భారత్ లో హిందువుల జనాభా 1950 నుంచి 2015 మధ్య కాలంలో 7.81 శాతం పడిపోయినట్లు ప్రధాన మంత్రికి చెందిన అడ్వైజరీ కౌన్సిల్ తన రిపోర్టులో పేర్కొంది. మరోవైపు దేశంలోని మైనార్టీల సంఖ్య మాత్రం పెరిగినట్లు వెల్లడించింది. తాజాగా విడుదల చేసిన ఆ రిపోర్టులో భారత్‌లో అత్యధికంగా ఉన్న హిందువుల జనాభా తగ్గుతూ ఉండగా బౌద్ద, సిక్కు, ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీల జనాభా పెరుగుతూ పోయిందని ఆ నివేదిక తేల్చింది. హిందువులతో పాటు పార్సీలు, జైనుల జనాభా కూడా తగ్గిందని తెలిపింది.
“సమీప మిత్ర దేశాల్లోని మెజారిటీ మతస్తుల సంఖ్య పెరుగుతుంటే భారత్‌లో మాత్రం ఆ సంఖ్య తగ్గుతోంది. భారత్‌లో హిందువుల జనాభా 1950 లో 84.68 శాతం ఉంది. 2015 నాటికి ఆ సంఖ్య 78.06 శాతానికి పడిపోయింది. అదే సమయంలో ముస్లిం జనాభా మాత్రం 9.84 శాతం నుంచి 14.09 శాతానికి పెరిగింది. అత్యధికంగా మయన్మార్‌లో హిందువుల జనాభా 10 శాతం క్షీణించింది. రెండో స్థానంలో 7.81 శాతంతో భారత్‌లో హిందువులు తగ్గారు. హిందు దేశమైన నేపాల్‌లో సైతం హిందువులు 3.6 శాతం పడిపోయింది.” అని ఈ నివేదిక వెల్లడించింది.