విదేశీ పర్యటన ముగించుకున్న ప్రధాని నరేంద్ర మోడీ నేడు ఉదయం నేరుగా బెంగుళూరు లోని ఇస్రో ప్రధాన కార్యాలయానికి వచ్చారు. ఇస్రో టెలిమెంటరీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ కి వెళ్లి.. చంద్రయాన్ 3 మిషన్ లో పాల్గొన్న శాస్త్రవేత్తలతో భేటీ అయ్యారు. అయితే ఉదయం బెంగుళూరు కి వచ్చిన ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు కర్ణాటక ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి ఎవరు హాజరు కాలేదు.
అయితే ప్రధాని మోదీ కంటే ముందే కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎం ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించడంపై మోడీ చికాకుగా ఉన్నారంటూ కాంగ్రెస్ నేత జయ్ రాం రమేష్ విమర్శించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ విమర్శలకు క్లారిటీ ఇచ్చారు ప్రధాని. వారిని విమానాశ్రయానికి రావద్దని తానే చెప్పానని అన్నారు. బెంగళూరుకు తాను ఏ సమయంలో చేరుకుంటానో తెలియదని.. అందుకే ప్రోటోకాల్ విషయంలో గవర్నర్, ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదని.. ఆ కారణంగానే వారిని రావద్దని చెప్పానని స్పష్టం చేశారు.