లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్‌సభ స్థానాలకు జరుగుతున్న ఓటింగ్ కార్యక్రమంలో ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం 11 గంటల వరకు పెద్ద ఎత్తున ఓటర్లు వచ్చి ఓటు వేశారు. సమయం గడుస్తున్న కొద్ది ఎండలు ముదరడంతో ఓటర్ల సంఖ్య తగ్గిపోతోంది. మళ్లీ మధ్యాహ్నం 3 తర్వాత పుంజుకునే అవకాశం ఉంది.
అయితే దాదాపుగా అన్ని ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగానే జరుగుతున్నా.. ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం అవాంఛనీయ ఘటన చోటుచేసుకుంది. బీజాపూర్ జిల్లాలో రెచ్చిపోయిన మావోయిస్టులు… చిహ్‌కా గ్రామ సమీపంలో ఓ ఐఈడీని పేల్చేశారు. ఈ పేలుడు ధాటికి సీఆర్పీఎఫ్‌కు చెందిన అసిస్టెంట్ కమాండంట్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ జవాన్ ఎన్నికల డ్యూటీలో ఉండగా ఈ పేలుడు జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు.
గాయపడ్డ జవాన్‌ను బైరామ్‌గర్హ్ ఆస్పత్రికి తరలించారు. ఐఈడీ పేలుడు నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమై ఆ ఏరియాలో కూంబింగ్ చేపట్టారు. లోక్‌సభ ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకుంటున్న పోలీసులు.. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.