కేంద్ర ప్రభుత్వం వంద రూపాయలు రిలీజ్ చేస్తే లబ్ధిదారుకు రూ.15 కూడా చేరడంలేదన్నారు కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘావాల్. దీన్ని కేంద్రం గుర్తించిందని.. అందుకే నేరుగా లబ్ధిదారుల ఖాతలో జమచేయాలని కేంద్ర ప్రభుత్వం భావించిందన్నారు. కాంగ్రెస్ హయాంలో ఇందిరమ్మ గృహాలను నిర్మించారు కానీ.. అధికారులు, రాజకీయ నేతల మధ్య ఎందరికి అందాయో తెలియదన్నారు. మోడీ ప్రధాని అయ్యాక ఇండ్ల నిర్మాణాలకు జియో ట్యాగింగ్ చేయడంతో నేరుగా లబ్ధిదారుకు ఫలాలు అందాయని వివరించారు.
2047 టార్గెట్ గా మోడీ విజన్ తో పనిచేస్తున్నారని తెలిపారు. 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నారన్నారు. కాంగ్రెస్ హయాంలో ఇండ్లు నిర్మిస్తామని చెప్పేది.. కానీ నిర్మించేది కాదన్నారు. కానీ మోడీ పాలనలో 3.5 కోట్లకు పైగా ఇండ్లు నిర్మించామన్నారు అర్జున్ రామ్. 11.72 కోట్ల టాయిలెట్లు నిర్మించామన్నారు. స్వచ్ఛ భారత్ లో భాగంగా ప్రధాని మోడీ స్వయంగా చీపురు పట్టుకుని క్లీనింగ్ ప్రారంభించారని గుర్తు చేశారు. దేశంలోని రైల్వే స్టేషన్లు అధునాతనంగా తీర్చిదిద్దామన్నారు.