జనవరి 16వ తేదీన భారత్ అత్యంత భారీ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం విదితమే. తొలి విడతలో 3 కోట్ల మంది ఫ్రంట్ లైన్ వారియర్లకు వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. అందులో భాగంగానే ఇప్పటి వరకు మొత్తం 12 లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. దీంతో భారత్ మరో మైలు రాయిని అధిగమించింది. ప్రపంచంలో అత్యధికంగా వ్యాక్సిన్ ఇచ్చిన టాప్ 10 దేశాల జాబితాలో చోటు దక్కించుకుంది.
ఇప్పటి వరకు అమెరికాలో 18.44 మిలియన్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వగా, చైనాలో 15 మిలియన్లు, యూకేలో 5.43 మిలియన్లు, ఇజ్రాయెల్‌లో 3.21 మిలియన్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. తరువాత యూఏఈలో 2.25 మిలియన్లు, జర్మనీలో 1.40 మిలియన్లు, ఇటలీలో 1.28 మిలియన్ల మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇక ఈ దేశాల తరువాత భారత్ వచ్చి చేరింది. దేశంలో ఇప్పటి వరకు 12,72,097 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. దీంతో అత్యంత ఎక్కువ మందికి వ్యాక్సిన్ ఇచ్చిన దేశాల్లో భారత్ ప్రస్తుతం 8వ స్థానంలో ఉంది.
కాగా తొలి దశలో భాగంగా 3 కోట్ల మందికి, రెండో దశలో 27 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇస్తారు. ఆ తరువాత 3వ దశలో దేశంలోని అందరికీ వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభిస్తారు. ఆగస్టు నుంచి 3వ దశ వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలుస్తోంది.