దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మెడికల్ విద్యను అభ్యసించాలనుకునే ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు రిజర్వేషన్లను కల్పిస్తున్నట్లు ప్రకటించింది. వైద్య విద్యను అభ్యసించాలనుకునే వారితోపాటు ఇప్పటికే డిప్లొమా, గ్రాడ్యుయేట్ లెవల్స్ లో వైద్య విద్యను చదువుతున్న వారికి కూడా ఈ రిజర్వేషన్లు అమలు కానున్నాయి. ఈ మేరకు ఓబీసీలకు 27 శాతం, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు 10 శాతం రిజర్వేషన్లు ఇకపై అమలవుతాయి.
నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం మెడికల్ అడ్మిషన్ల కోసం ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు ఆల్ ఇండియా కోటాలో రిజర్వేషన్లకు ఓకే చెప్పింది. దీంతో గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, డిప్లొమా స్థాయి మెడికల్ కోర్సుల విద్యార్థులకు రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఈ నిర్ణయం వల్ల ఎంతో మంది విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది.
ఆల్ ఇండియా కోటా (ఏఐక్యూ) కింద ఈ రిజర్వేషన్లు ఇవ్వనున్నారు. దీని కింద ఇప్పటికే ఎస్సీలకి 15 శాతం, ఎస్టీ కేటగిరీ విద్యార్థులకు 7.5 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నారు. కొత్త కోటా ప్రస్తుతం ఉన్న నిబంధనలకు అదనంగా ఉంటుంది.
నీట్ (యూజీ, పీజీ) క్లియర్ చేసిన తరువాత విద్యార్థులు కౌన్సెలింగ్ కోసం హాజరుకావాలి. కౌన్సెలింగ్ కేంద్ర, రాష్ట్ర స్థాయిలలో జరుగుతుంది. 50 శాతం పీజీ, 15 శాతం యూజీ సీట్లు సెంట్రల్ కోటా లేదా ఆల్ ఇండియా కోటా పరిధిలోకి వస్తాయి. ఈ విభాగంలో కొత్త రిజర్వేషన్లు చేర్చబడతాయి. కాగా ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం సాయంత్రం ఓ సమావేశాన్ని నిర్వహించారు. మెడికల్ కాలేజీలలో ఓబీసీల రిజర్వేషన్ల దీర్ఘకాలిక డిమాండ్ గురించి చర్చించారు. ఓబీసీ అభ్యర్థులకు రిజర్వేషన్లు ఇవ్వడమే కాకుండా ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి కూడా ప్రధాని రిజర్వేషన్లను అందిస్తున్నట్లు ప్రకటించారు.