సార్వత్రిక ఎన్నికల వేళ షోపియాన్, అనంత్నార్లో జరిగిన ఉగ్రదాడులపై జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా స్పందించారు. ఈ ఉగ్రదాడులపై అంతర్జాతీయ ఏజెన్సీలు దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాదం ఆగిపోయే వరకు పొరుగు దేశం పాకిస్తాన్ తో ఎటువంటి చర్చలు ఉండబోవని తెలిపారు.
‘భారత్ కి పాకిస్తాన్ నుంచి సహకారం కావాలి. అమాయకులను చంపే నిందితులను గుర్తించాలి. ఇటీవల జరిగిన హత్యలపై అంతర్జాతీయ ఏజెన్సీలు విచారణ జరపాలి’ అని వ్యాఖ్యానించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిగే వరకు జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. ఇలాంటి దాడులు కశ్మీర్లోని పర్యాటక రంగంపై ప్రతికూల ప్రభావం చూపుతాయన్నారు. కాగా, రెండు వేర్వేరు ఘటనలో ఓ వ్యక్తి, టూరిస్టు దంపతులను ఉగ్రవాదులు కాల్చిచంపిన విషయం తెలిసిందే. ఐదో దశ సార్వత్రిక ఎన్నికలు ఒక రోజు ముందే ఈ ఘటన చోటు చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది.