భారత్‌లో ఐఫోన్ 15 అమ్మకాలు ప్రారంభం.. యాపిల్ స్టోర్ ముందు క్యూ కట్టిన కస్టమర్లు.. లాంచ్‌ ఆఫర్లివే

-

యాపిల్ కంపెనీ సెప్టెంబరు 12న ప్రపంచ వ్యాప్తంగా ఐఫోన్‌ 15 సిరీస్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం నాలుగు వేరియంట్లలో ఈ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ముంబయిలోని యాపిల్ స్టోర్​లో ఇవాళ్టి నుంచి ఈ మోడల్ ఫోన్​ల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. స్టోర్ తెరవకముందే ఇక్కడ కస్టమర్లు బారులు తీరారు. గంటలు గడిచేకొద్ది యాపిల్ స్టోర్ ముందు కస్టమర్ల రద్దీ పెరిగిపోయింది. వీరిలో ఎక్కువ మంది యువతే ఉండటం గమనార్హం.

ఐఫోన్‌ 15 (iPhone 15), ఐఫోన్ 15 ప్లస్ (iPhone 15 Plus), ఐఫోన్ 15 ప్రో (iPhone 15 Pro), ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌ (iPhone 15 Pro Max) నాలుగు వేరియంట్లను మార్కెట్​లోకి ప్రవేశపెట్టింది యాపిల్ సంస్థ. భారత్‌ మార్కెట్లో ఐఫోన్ 15 ప్రారంభ ధర రూ.79,900గా కంపెనీ నిర్ణయించింది. ఇక ఐఫోన్ 15 ప్లస్‌ రూ.89,900 కాగా, ఐఫోన్ 15 ప్రో ధర రూ.1,34,900, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌ను రూ.1,59,900కి విక్రయించనుంది.

అయితే ఈ మోడల్ లాంఛ్‌ ఆఫర్‌ కింద హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డుతో ఐఫోన్ 15 సిరీస్‌ను కొనుగోలు చేసేవారు ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ పొందవచ్చని యాపిల్ కంపెనీ తెలిపింది. ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌ మోడల్స్‌ కొనుగోలు చేసేవారికి రూ.6,000 వరకు డిస్కౌంట్‌.. ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ మోడల్స్‌పై రూ.5,000 డిస్కౌంట్‌.. పాత ఐఫోన్‌ను ఎక్స్ఛేంజ్‌ చేయడం ద్వారా ట్రేడ్‌-ఇన్‌ బెనిఫిట్‌ కింద డిస్కౌంట్‌ పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news