అంతరిక్షంలో సొంతంగా ఓ స్పేస్ స్టేషన్ను ఏర్పాటు చేసుకునేందుకు ఇస్రో సన్నాహాలు షురూ చేసింది. ఈ క్రమంలోనే తాజాగా అంతరిక్షంలో కీలకమైన శక్తి వనరుల వినియోగంపై ప్రయోగం చేపట్టింది. ఇందులో భాగంగానే సరికొత్త ఫ్యుయల్ సెల్‌ను ఇవాళ విజయవంతంగా దిగువ భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఇవాళ ఏపీలోని తిరుపతి సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్‌ఎల్‌వీ-సీ58 వాహక నౌకను విజయవంతంగా నింగిలోకి పంపిన విషయం తెలిసిందే.
ఈ వాహక నౌక ‘ఎక్స్-రే పొలారిమీటర్ ఉపగ్రహాన్ని నేడు అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. ఇదే వాహకనౌక చివరి దశలో మరో పది పరికరాలను అంతరిక్షానికి మోసుకెళ్లి నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టిందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. వీటిలో ఫ్యుయల్ సెల్ పవర్ సిస్టమ్ (FCPS) కూడా ఒకటి అని వెల్లడించారు. ‘పీఎస్‌ఎల్‌వీ ఆర్బిటల్ ఎక్స్‌పెరిమెంటల్ మాడ్యూల్ (POEM)’లో భాగంగా దీన్ని నింగిలోకి పంపించినట్లు చెప్పారు.
ఈ ఫ్యుయల్ సెల్ టెక్నాలజీని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అభివృద్ధి చేసిందని ఇస్రో ఛైర్మన్ తెలిపారు. రోదసిలో సమర్థవంతమైన సుస్థిర శక్తి వనరును భారత్‌కు అందించడానికి ఇది ఉపయోగపడుతుందని వెల్లడించారు.