భారత్‌లో ఎన్నికలపై ఐక్యరాజ్య సమితి సీనియర్ అధికారి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దేశంలో ఎన్నికలు ‘‘స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా’’ జరగాలని ఆ అంతర్జాతీయ సంస్థ తమకు చెప్పాల్సిన అవసరం లేదని దీటుగా బదులిచ్చారు. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడం, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడం వంటి పరిణామాలపై ఇటీవల ఐరాస ప్రధాన కార్యదర్శి అధికార ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ స్పందిస్తూ.. ‘‘భారత్ సహా ఎన్నికలు జరగనున్న ఏ దేశంలోనైనా ప్రజల రాజకీయ, పౌర హక్కుల రక్షణ ఉంటుందని.. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా, నిష్పాక్షిక వాతావరణంలో ఓటు వేయగలరని ఆశిస్తున్నాం’’ అని అన్నారు. దీనిపై జైశంకర్ స్పందించారు.
భారత్ లో ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా జరగాలని ఐరాస చెప్పాల్సిన అవసరం లేదని జైశంకర్ అన్నారు. తమకు భారతదేశ ప్రజలు ఉన్నారని, వారే ఎన్నికలు సజావుగా జరిగేలా చూస్తారని తెలిపారు. దాని గురించి ఎవరూ చింతించాల్సిన పనిలేదని ఐరాసకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.