ఇరాన్తో భారత్ చాబహార్ పోర్టు ఒప్పందం వ్యవహారంలో అమెరికా హెచ్చరికలపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పందించారు. ఈ ఒప్పందాన్ని సంకుచిత దృష్టితో చూడకూడదని అమెరికాకు హితవు పలికారు. ఇరాన్‌తో వాణిజ్య ఒప్పందాలు చేసుకొనే దేశాలపై ఆంక్షల ముప్పు పొంచి ఉంటుందని మంగళవారం రోజున అమెరికా విదేశాంగశాఖ ప్రతినిధి వేదాంత్ పటేల్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. తాను రాసిన ‘వై భారత్ మ్యాటర్స్’ పుస్తకం బంగ్లా వెర్షన్ విడుదల సందర్భంగా విలేకర్లు ఆయన్ను అమెరికా వ్యాఖ్యలపై ప్రశ్నించారు.
‘‘చాలా కాలం నుంచి పోర్టుపై పనిచేస్తున్నాం. కానీ, ఎప్పుడూ సుదీర్ఘకాలం ఒప్పందం చేసుకోలేదు. దీనికి ఇరాన్ వైపు సమస్యలు, జాయింట్ వెంచెర్ భాగస్వామి మార్పులు, నిబంధనలు ఇలా చాల సమస్యలున్నాయి. వాస్తవానికి దీర్ఘకాలిక ఒప్పందంతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. చివరికి ఎట్టకేలకు సమస్యలు పరిష్కరించుకొని డీల్‌పై సంతకాలు చేశాం. ఇది లేకపోతే రేవు నిర్వహణ కష్టమైపోతుంది. అంతిమంగా చాబహార్ వల్ల ఈ ప్రాంతం మొత్తానికి ప్రయోజనం లభిస్తుంది’’ అని జైశంకర్ వెల్లడించారు.