మరోసారి వెస్టర్న్‌ మీడియాకు జైశంకర్‌ చురకలు

-

భారత ఎన్నికలపై దుష్ప్రచారం చేస్తున్న వెస్టర్న మీడియాపై మరోసారి విదేశాంగ మంత్రి జైశంకర్‌ ఫైర్ అయ్యా రు. ఎన్నికల ఫలితాలను తేల్చుకోవడానికి కోర్టుకు వెళ్లేవారు భారత్‌కు హితబోధ చేస్తున్నారంటూ కౌంటర్ ఇచ్చారు. దాదాపు రెండు శతాబ్దాల పాటు ప్రపంచంపై బలవంతంగా తమ విధానాలను రుద్దిన దేశాలు ఇంకా ఆ మనస్తత్వాన్ని వదులుకోలేకపోతున్నాయని మండిపడ్డారు. ‘‘వై భారత్‌ మ్యాటర్స్‌’’ పేరిట ఆయన రాసిన పుస్తకానికి బంగ్లా ఎడిషన్‌ను విడుదల చేస్తూ కోల్‌కతాలో ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆయా దేశాలను ఒక నిర్దిష్ట వర్గం పాలించాలని పాశ్చాత్య మీడియా ఆశిస్తుంటుంది. భారత్‌లో అది జరగకపోయే సరికి అసహనానికి లోనవుతోంది. వారు అనుకున్న విధంగానే భారత్‌ ఉండాలని ఆశిస్తున్నారు. లేకపోతే దుష్ప్రచారం మొదలుపెడతారు. ప్రతిష్ఠను దిగజార్చేందుకు యత్నిస్తారు. ఇదంతా ఒక ‘మైండ్‌ గేమ్‌’ అని జైశంకర్ కొట్టిపారేశారు.

మండుటెండల్లో భారత్‌లో ఎన్నికలు నిర్వహిస్తున్నారంటూ విదేశీ పత్రిక ఒకటి విమర్శలు చేస్తూ ఇటీవల ఓ కథనం ప్రచురించింది. ఎన్నికలకు ముందు కేజ్రీవాల్‌ అరెస్టు, కాంగ్రెస్‌ పార్టీ బ్యాంకు ఖాతాలపై ఆంక్షల వంటి అంశాలను ప్రస్తావిస్తూ మరికొన్ని పత్రికలు విమర్శనాత్మక వ్యాసాలను ప్రచురించాయి. ఈ నేపథ్యంలోనే జైశంకర్‌ తాజాగా వాటికి దీటైన సమాధానమిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news