పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి విధించిన రెండేళ్ల శిక్ష నిలుపుదలకు నిరాకరించిన గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హేమంత్ ప్రచక్ బదిలీ కానున్నారు. బదిలీల నిమిత్తం సుప్రీంకోర్టు కొలీజియం తాజాగా ప్రతిపాదించిన జాబితాలో ఆయన పేరు కూడా ఉంది. ఈ బదిలీలకు సంబంధించిన వివరాలను సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. బదిలీల జాబితాలో పంజాబ్, హరియాణా హైకోర్టుకు చెందిన నలుగురు న్యాయమూర్తులు, అలహాబాద్ హైకోర్టుకు చెందిన ఒక న్యాయమూర్తి సహా మొత్తం 23 మంది న్యాయమూర్తుల పేర్లు ఉన్నాయి.
మోదీ ఇంటిపేరు’పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పరువునష్టం కేసులో రాహుల్ గాంధీ.. తనకు విధించిన రెండేళ్ల శిక్షను నిలిపివేయాలంటూ వేసిన స్టే పిటిషన్‌ను జులై నెలలో గుజరాత్ హైకోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో కిందికోర్టు విధించిన శిక్ష న్యాయపరమైందేనని. ఈ శిక్షను నిలిపివేసేందుకు ఎలాంటి కారణాలు కన్పించట్లేదని.. అందుకే పిటిషనర్ అభ్యర్థనను కొట్టివేస్తున్నామని జస్టిస్ హేమంత్ ప్రచక్ గతంలో తీర్పు వెలువరించారు.