సెలబ్రిటీల ఇంటి పక్కన ఉండాలని చాలా మందికి కోరిక ఉంటుంది. కానీ అందరికీ అది కుదరదు. కానీ వాళ్ల ఇంటి పక్కన ఉంటే ఎలాంటి సమస్యలు వస్తాయో అక్కడ ఉన్న వారికే తెలుస్తుంది. చాలా సందర్భాల్లో సెలబ్రిటీల ఇంటి పక్కన వాళ్లకు సమస్యలు వస్తుంటాయి. తాజాగా బెంగళూరులో ఓ వ్యక్తికి కూడా అలాంటి సమస్యే వచ్చింది. ఆ సమస్యకు ఆయనకు చిర్రెత్తి చేసిన పని ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇంతకీ ఏం జరిగిందంటే..?
బెంగళూరు కుమారకృప రహదారిలోని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇంటి పక్కనే పురుషోత్తమ్ అనే వ్యక్తి ఉంటున్నారు. ముఖ్యమంత్రిని చూసేందుకు వచ్చే ప్రముఖులు, పోలీసులు అందరూ తన ఇంటి ముందు కార్లు, వాహనాలను నిలపడం ఆయనకు చికాకు కలిగించింది. తన కారును ఇంటి నుంచి బయటకు తీసేందుకు కూడా ఇబ్బంది ఎదురవుతోందని ఆయనకు చిర్రెత్తుకొచ్చింది. దీంతో పురుషోత్తమ్.. గురువారం సీఎం బయటకు వెళ్లే సమయాన్ని చూసుకుని ఆయన కాన్వాయికి అడ్డుగా తన వాహనాన్ని ఉంచారు. దాన్ని పక్కకు తీయాలని భద్రతా సిబ్బంది చెప్పినా వినలేదు. చివరకు ముఖ్యమంత్రి పురుషోత్తమ్‌ను పిలిపించుకుని.. మరోసారి ఇటువంటి సమస్య రాకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు. ఆ తర్వాతే ఆయన తన వాహనాన్ని అడ్డు తీశారు.