తెలంగాణను గత వారం నుంచి వర్షాలు పీడిస్తున్న విషయం తెలిసిందే. అయితే శుక్రవారం మధ్యాహ్నం నుంచి వానలు కాస్త తగ్గుముఖం పట్టాయి. అయితే రాష్ట్రంలో శనివారం నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తీవ్ర అల్పపీడనం శుక్రవారం ఉదయానికల్లా అల్పపీడనంగా బలహీనపడిందని వెల్లడించారు. ఈ అల్పపీడనం దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్ర పరిసర ప్రాంతాల్లో విస్తరించి ఉందని వివరించారు. అయితే ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిజామాబాద్, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో మాత్రం వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, వికారాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్రంలో రుతుపవనాల ప్రభావం అధికంగా ఉందని.. మరో అల్పపీడనం ఏర్పడితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది.