కర్ణాటకలో కొలువైన కాంగ్రెస్ సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే కన్నడ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్నభాగ్య పథకంలో బియ్యం బదులుగా నగదు ఇవ్వాలని నిర్ణయించింది. రేషన్ కార్డులో ఉన్న ప్రతి లబ్ధిదారుడికి కిలో బియ్యానికి 34 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది. బియ్యం కొరతతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కర్ణాటక పౌరసరఫరాల శాఖ మంత్రి ముణియప్ప తెలిపారు.
భారత ఆహార సంస్థ ప్రామాణిక ధర అయిన కేజీ 34 రూపాయలకు బయట మార్కెట్‌లో ఎక్కడా బియ్యం అందుబాటులో లేదని చెప్పారు. ఈ నేపథ్యంలోనే నగదు ఇవ్వాలని కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. బియ్యం అందుబాటులోకి వచ్చేవరకు ఇదే విధానం కొనసాగుతుందని స్పష్టం చేశారు. జులై 1వ తేదీ నుంచే ఇది అమలులోకి వస్తుందని ముణియప్ప పేర్కొన్నారు. అన్న భాగ్య పథకంలో భాగంగా 5 కేజీల బియ్యం ఉచితంగా ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పేర్కొంది. కేంద్రం ప్రధాని గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద ఇస్తున్న 5 కేజీలకు అదనంగా తాము 5 కేజీలు ఇస్తామని కర్ణాటకలో కాంగ్రెస్ ప్రకటించింది.