సుప్రసిద్ధ కేదార్నాథ్ ఆలయాన్ని అర్చకులు మూసివేశారు. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ప్రతి ఏటా దీపావళి పండుగ రెండ్రోజుల తర్వాత ఆలయాన్ని మూసివేయడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా అదే ఆనవాయితీని పాటిస్తూ ఆలయ తలుపులను మూసివేశారు. భారత ఆర్మీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది.
బుధవారం ఉదయం 8 గంటల సమయంలో ఆలయ అర్చకులు మంత్రాలు పఠిస్తూ కేదారీశ్వరుడి గుడి తలుపులు మూసివేశారు. ఆలయం తెరిచే కార్యక్రమం ఎలా ఘనంగా నిర్వహిస్తారో మూసివేత కార్యక్రమం కూడా వైభవంగా జరిపే ఆనవాయితీ పూర్వ కాలం నుంచి వస్తోందని అర్చకులు తెలిపారు. ఆలయం తలుపులు మూసివేసే సమయంలో అక్కడికి వచ్చిన భక్తులంతా జై భోలేనాథ్.. హరహర మహాదేవ్ అంటూ శివనామస్మరణ చేశారు. ఆ పరమేశ్వరుని నామస్మరణతో ఆ మంచుకొండలు మార్మిగిపోయాయి.
ఆలయం తలుపులు మూసివేసిన అనంతరం.. భక్తి శ్రద్దలతో శివయ్య పంచముఖీ దేవత విగ్రహం శ్రీ ఓంకారేశ్వరాలయం, ఉఖీమఠ్కు తీసుకు వెళ్లారు. వచ్చే 6 నెలల పాటు ఉఖీమఠ్‌లోనే మహాదేవునికి పూజలు నిర్వహించనున్నట్లు అర్చకులు తెలిపారు.