అయోధ్య భవ్యరామ మందిర ప్రాణప్రతిష్ఠకు ముహూర్తం సమీపిస్తోంది. మరో నాలుగు రోజుల్లో జరగనున్న ఈ అద్భుత ఘట్టాన్ని కనులారా వీక్షించేందుకు యావత్ భారతావని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మరోవైపు అయోధ్య రాముడికి దేశవ్యాప్తంగా పలుచోట్ల నుంచి కానుకలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే రాముడి అత్తారింటి నుంచి పలు కానుకలు వచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు శ్రీకృష్ణ జన్మస్థానం నుంచి కూడా బహుమతులు చేరాయి.
ఇక తాజాగా అయోధ్య రాముడికి కేరళలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి కూడా కానుక పంపేందుకు రంగం సిద్ధమయింది. ఈ ఆలయం నుంచి సంప్రదాయ ఆచారంలో భాగమైన ‘ఓనవిల్లు’ ను రామయ్యకు కానుకగా ఇవ్వనున్నారు. విల్లు ఆకారంలోని ఈ చెక్క పలకకు రెండు వైపులా దశావతారాలు, శ్రీరామ పట్టాభిషేకం వంటి బొమ్మలు చిత్రీకరించారు. ఇవాళ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రతినిధులకు ఈ ఓనవిల్లును అందజేయనున్నట్లు పద్మనాభస్వామి ఆలయ పాలకవర్గం తెలిపింది. కొచిన్ నుంచి విమానంలో దీన్ని అయోధ్యకు తరలించనున్నట్లు వెల్లడించింది.