ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రారంభమైన పోరు పశ్చిమాసియాలో క్రమంగా విస్తరిస్తోంది. రోజుకో దాడి, ప్రతిదాడులతో ఆ ప్రాంతమంతా అట్టుడుకుతోంది. ఎర్రసముద్రంలో వాణిజ్య, యుద్ధ నౌకలపై చేస్తున్న దాడులను ఆపకపోతే చర్యలు తప్పవని హెచ్చరిస్తూ తాజాగా యెమెన్‌లోని హౌతీ స్థావరాలే లక్ష్యంగా అమెరికా సైన్యం మరోసారి దాడులకు తెగబడింది. ఎర్ర సముద్రం నుంచి యుద్ధ నౌకలు, జలాంతర్గాముల ద్వారా క్షిపణులను ప్రయోగించింది. ఇప్పటి వరకు ఇది నాలుగో దాడి.
హౌతీలను తిరిగి అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేరుస్తూ బుధవారం అమెరికా ప్రకటన చేయడంతో వారికి నిధుల సేకరణ కష్టతరంగా మారనుంది. మరోవైపు ఈ ప్రకటన చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే హౌతీ స్థావరాలపై అగ్రరాజ్యం దాడులకు పాల్పడింది. గత శుక్రవారం అమెరికా, బ్రిటీష్ సేనలు తొలిసారి యెమెన్‌లో హౌతీల అధీనంలో ఉన్న దాదాపు 60 ప్రాంతాలపై బాంబులతో విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. హౌతీలు మాత్రం అగ్రరాజ్య ఆదేశాలను బేఖాతరు చేస్తూ తిరిగి వరుస దాడులకు పాల్పడటంతో అమెరికా మళ్లీ దాడులను ఉద్ధృతం చేసింది.