తెలుగోడు తలుచుకుంటే సాయంత్రానికి జీవో ఖాయం : కిషన్‌రెడ్డి

తెలుగువారంతా ఏకమై తమిళనాడులో హక్కుల కోసం పోరాడితే తమిళనాడు ప్రభుత్వం సాయంత్రానికల్లా దిగొచ్చి జీవో ఇస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అంతటి సత్తా ఇక్కడ ఉన్నవారిలో ఉందని తెలిపారు. ఆలిండియా తెలుగు ఫెడరేషన్‌ (ఏఐటీఎఫ్‌) ఆధ్వర్యంలో చెన్నైలోని ఆస్కా భవనంలో సోమవారం జరిగిన తెలుగువారి ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

ఇక్కడివారు ఇతర భాషలపై మక్కువ పెంచుకోవడం, తమిళనాడు ప్రభుత్వం తెలుగువారిని ఐక్యంగా ఉంచకపోవడం లాంటి కారణాలతో తెలుగు కనుమరుగయ్యే పరిస్థితి ఉందని కిషన్ రెడ్డి అన్నారు. కేంద్ర మంత్రిగా ఉన్న తాను జేబులో పెట్టుకునే కలం కొనాలన్నా తమకు కేటాయించిన ఒక యాప్‌లోకి వెళ్లి ఆర్డర్‌ ఇవ్వాలని తెలిపారు. ‘ఇలాగే కుర్చీలు, బిస్కట్లు.. ఇలా దిల్లీలోని తన కార్యాలయానికి ఏవి కావాలన్నా ఇదే ప్రక్రియ. ఆర్డర్‌ రాగానే వారికి డబ్బులు ఇచ్చేయాలి. పారదర్శకంగా ఉండేందుకు ప్రధాని మోదీ ఈ ప్రక్రియ తెచ్చారు’ అని వెల్లడించారు.