కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిపై కరెంట్ దొంగ అనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీపావళి లైటింగ్ కోసం ఆయన ఓ విద్యుత్ స్తంభం నుంచి కరెంట్ చౌర్యం చేశారన్న ఆరోపణలతో ఆయనపై కేసు నమోదు అయింది. ఈ క్రమంలో ఆయన విద్యుత్ శాఖ విధించిన రూ.68వేల జరిమానాను కట్టారు. అయితే ఫైన్ కట్టిన తర్వాత కూడా తనను సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కరెంట్ దొంగ అని ప్రస్తావించడాన్ని కుమారస్వామి తప్పుబట్టారు. జరిమాన కట్టిన తర్వాత కూడా వారు అలా ప్రవర్తించడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.
అయితే ఓ ఈవెంట్ మేనేజర్ చేసిన పనికి తాను చింతిస్తున్నానని కుమారస్వామి తెలిపారు. దీపావళి లైటింగ్ చేయడానికి నియమించిన ఈవెంట్ మేనేజర్ తనకు తెలియకుండా ఈ పని చేశారని.. ఆ సమయంలో తాను ఇంట్లో లేరని ఇప్పటికే కుమారస్వామి చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు జరిమానా కూడా కట్టారు. అయినా ఈ విషయంపై రాజకీయ పార్టీలు రాద్ధాంతం చేయడం అన్యాయమని కుమారస్వామి వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకే తనపై కక్ష కట్టారని ఆరోపించారు.